నాగోబా సన్నిధిలో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు
- నాగుల పంచమికి భారీగా తరలివచ్చిన ఆదివాసీ భక్తులు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: నాగుల పంచమి పండుగ సందర్భంగా ఆదివాసుల ఇలవేల్పు కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో సోమవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులు నాగోబాను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ఎస్పీ అఖిల్ మహాజన్‌కు స్వాగతం పలికారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఆలయంలో తలకు తలపాగా చుట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూరు ఏఎస్పీని శాలువాలతో సత్కరించారు. అనంతరం జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులతో కలిసి ఎస్పీ పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బందోబస్తు సిబ్బంది, భక్తులు పూర్తిగా వెళ్లిపోయే వరకు సిబ్బంది అక్కడే ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో సహాయం కోసం డయల్ 100 లేదా 112కు సంప్రదించాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్‌ఐ సాయన్న, ఎస్‌ఐ విక్రమ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
