ప్రభుత్వంతో పాటు పార్టీని బలోపేతం చేయండి..

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : కాంగ్రెస్‌లోని నేతలు వర్గ విభేదాలను విడనాడి ప్రభుత్వాన్ని, పార్టీని బలోపేతం చేసే దిశగా కలిసి నడవాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేంద్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా కమిటీ సమావేశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణలో తదుపరి దశ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ రెండో దశ కార్యాచరణ ప్రణాళికపై నేతలు పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. పట్టణ, డివిజన్, మండల కమిటీల నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్‌-2 కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సచిన్ సావంత్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని సచిన్ సావంత్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. గ్రూపు విభేదాలను పక్కనపెట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు, బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. ఓటర్లు జాబితా నుంచి తప్పిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

పేద వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచేలా సమన్వయంతో పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడేవారికి పదవులు దక్కుతాయని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎకరం భూమి కేటాయించినందుకు జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న పదవులను సీనియర్లతో భర్తీ చేయాలని కోరారు.

పలుచోట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయని, వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజానంద్, మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, నాయకులు సాజిద్ ఖాన్, శ్యాం నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష సతీష్, అడ్డి బోజా రెడ్డి, గణేష్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.