ఆలేరు ప్రజావాణిలో 12 ఫిర్యాదుల స్వీకరణ..

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఈ కార్యక్రమం నోడల్ అధికారి, ఎంపీడీవో కె. సత్య ఆంజనేయ ప్రసాద్ పర్యవేక్షణలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, వైద్యాధికారి హైమావతి, పశువైద్యాధికారి చైతన్య, సీడీపీవో స్వరాజ్యం, ఎంపీవో అనురాధ, ఏపీవో అరుణ హాజరయ్యారు.

ఆలేరు మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ప్రజావాణికి హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 12 మంది తమ ఫిర్యాదులను నమోదు చేశారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి నాలుగు, మున్సిపాలిటీకి నాలుగు, గనుల శాఖకు రెండు, గిరిజన సంక్షేమ శాఖకు ఒకటి, పౌరసరఫరాల శాఖకు ఒక ఫిర్యాదు చొప్పున ఉన్నాయి. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత శాఖలకు పంపినట్లు అధికారులు తెలిపారు.