మేడారం జాతరకు వేగంగా విద్యుత్ సరఫరా పనులు
- సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హనమకొండ, ఆంధ్రప్రభ: మేడారం జాతరకు అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో శనివారం 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎండీ మాట్లాడుతూ… మేడారం పరిధిలో 7.5 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ పనులు పూర్తయ్యాయి, కొత్తగా 50 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 20 కిలోమీటర్ల లైన్ పనులు ముగిశాయి అన్నారు. సమయం తక్కువగా ఉండటంతో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమ్మక్క సబ్స్టేషన్లో అదనంగా 5 ఎంవిఎ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తుండగా, జంపన్న వాగు వద్ద మూడు కొత్త టవర్ పోల్లు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు.
వేసవి సీజన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అర్బన్ ప్రాంతాల్లో ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని వచ్చే నెలాఖరు వరకు పెంచాలని 16 సర్కిళ్ల ఎస్ఈలకు సూచించారు. ఓవర్లోడ్ ఫీడర్లపై లోడ్ బదిలీ చేపట్టి ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. టార్గెట్ మేరకు 33 కెవి ఇంటర్లింకింగ్ పనులు పూర్తి చేయాలని, బంచింగ్లో ఉన్న ఫీడర్లను వేరుచేయాలని సూచించారు. వీలైనంత వరకు లైన్ క్లియరెన్సులు తగ్గించాలి అని అన్నారు.
16 సర్కిళ్ల పరిధిలో ఇప్పటివరకు 3300 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేసినట్లు తెలిపారు. డిసెంబర్లో వ్యవసాయ కనెక్షన్ల మంజూరును మరింత పెంచాలని ఆదేశించారు. TG iPass, Non-TG iPass దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై సమీక్షిస్తూ, దరఖాస్తు చేసిన సర్వీసులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని వరుణ్ రెడ్డి ఆదేశించారు.
సమీక్షలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, సి. ప్రభాకర్, సీఈలు టి. సదర్ లాల్, కె. తిరుమల్ రావు, కె. రాజు చౌహన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, శ్రవణ్ కుమార్, జయవంత్ రావు చౌహన్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు వేణు బాబు, కృష్ణ మోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.
