సీఎం రేవంత్ రెడ్డికి ఏలేటి బహిరంగ లేఖ..
- పోలీస్ కొలువుల భర్తీపై తీవ్ర అసంతృప్తి..
- 2 లక్షల ఉద్యోగాలపై శ్వేతపత్రం డిమాండ్!
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో పోలీస్ కొలువుల భర్తీ, విరుద్ధమైన జీఓల అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ శాసనసభా పక్ష (BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నియామకాల తీరు నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.
20 వేల ఖాళీలు ఉంటే.. 7 వేలకే అనుమతా?
తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం దాదాపు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఇంత భారీగా కొరత ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 7,437 పోస్టుల భర్తీకే నోటిఫై చేస్తూ ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అరకొర పోస్టుల భర్తీ నిర్ణయం ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. పోలీస్ శాఖలోని అన్ని ఖాళీలను ఒకేసారి గుర్తించి వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జీఓ 46తో గ్రామీణ అభ్యర్థులకు శాపం!
రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన జీఓ 46 (GO 46) అంశాన్ని మహేశ్వర్ రెడ్డి ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. “జీఓ 46 అమలు వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాంతాల వారీగా విడివిడిగా కటాఫ్ విధానాన్ని వర్తింపజేయడం వల్ల మంచి ప్రతిభ, మెరిట్ ఉన్న అభ్యర్థులకు సైతం ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జీఓ 46ను పూర్తిగా రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన.. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ఆ హామీని ఎందుకు బుట్టదాఖలు చేశారని నిలదీశారు.
2 లక్షల ఉద్యోగాలపై శ్వేతపత్రం కావాలి
అధికారంలోకి వస్తే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై స్పష్టత ఇవ్వాలని బీజేఎల్పీ నేత డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో, ఇంకా ఎన్ని ప్రక్రియలో ఉన్నాయో స్పష్టం చేస్తూ తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
దీంతో పాటు, నోటిఫికేషన్లు, ఉద్యోగాల కోసం గతంలో శాంతియుతంగా ఆందోళనలు చేసిన నిరుద్యోగులు, అభ్యర్థులపై అక్రమంగా నమోదు చేసిన పోలీస్ కేసులను ప్రభుత్వం ఏకపక్షంగా, తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో గట్టిగా డిమాండ్ చేశారు.
