ఫోటో మార్ఫింగ్‌తో తప్పుడు ప్రచారం..

ఉద్యోగిపై చర్యలు కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు

గద్వాల, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉన్నతాధికారి ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త డాక్టర్ బి.ఆర్. అబ్రహం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి ఉన్నట్లు చూపిస్తూ, అదే శాఖలో పనిచేస్తున్న మేల్ వర్కర్ శ్యామ్ తన ఫోటోను డిజిటల్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా, వాట్సాప్ తదితర మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు.

ఈ నకిలీ ఫోటో ఆధారంగా జిల్లా అధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని, అక్రమ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసపూరిత చర్యలకు పాల్పడ్డాడనే ఫిర్యాదులు పోలీసుల దృష్టికి వెళ్లాయని తెలిపారు. అలాగే ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను ఏకవచనంతో సంబోధిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.

ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటో మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.