‘కాల్ మనీ’ ఆరోపణలు రాజకీయమే..

  • ఎంపీ చిన్ని, మంత్రి కొల్లుకు సంబంధం లేదు
  • బాధితుల ఆవేదన

విజయవాడ, ఆంధ్రప్రభ: మాజీ ఎంపీ కేశినేని నాని రాసిన లేఖలో చేసిన ‘కాల్ మనీ’ ఆరోపణలను ఖండిస్తూ బాధితులు సోమవారం మీడియా ముందుకు వచ్చారు. యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న కోరాడ విజయ్ కుమార్, గాయత్రికి మద్దతుగా మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాయడం తమను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

బాధితుడు వెనిగండ్ల హర్షవర్ధన్ మాట్లాడుతూ, తమకు కోరాడ విజయ్ కుమార్, గాయత్రిల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం మాత్రమే ఉందని, ఇందులో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే వారి పేర్లను ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తాము ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, తమను చంపేస్తామని కోరాడ విజయ్ కుమార్ బెదిరించాడని హర్షవర్ధన్ ఆరోపించారు.

ఇప్పటికే తమపై దాడులు చేయించడంతో పాటు రెక్కీలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. “రాహుల్‌ను నేనే చంపాను… నువ్వెంత” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. కోరాడ విజయ్ కుమార్, గాయత్రి చెప్పిన మాటలను నమ్మి మాజీ ఎంపీ కేశినేని నాని ‘కాల్ మనీ’ అంటూ ట్వీట్ చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. తాము డబ్బులు కోల్పోయి, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు, తన కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా అందుకు కోరాడ విజయ్ కుమార్, గాయత్రిలే పూర్తి బాధ్యత వహించాలని మీడియా ముఖంగా ప్రకటించారు. వాస్తవాలను నిష్పక్షపాతంగా విచారించి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.