విద్యుదాఘాతంతో గేదె మృతి..

రైతుకు రూ. లక్ష నష్టం

ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి ఘటన.. బాధిత రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి గ్రామంలో విద్యుదాఘాతానికి గురై గేదె మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బాధిత రైతుకు సుమారు రూ. లక్ష మేర ఆర్థిక నష్టం వాటిల్లింది.

బాధిత రైతు గుడిసె బాల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ప్రతిరోజులాగే తన గేదెను మేత కోసం పొలానికి వదిలాడు. మేత మేస్తూ వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.

గేదె మృతి చెందడంతో రైతు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని తెలిపాడు. ఒక్కసారిగా గేదెను కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వాపోయాడు.

ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని, బాధిత రైతుకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, బీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు.