AP Population Policy | “పిల్లలే సంపద” పథకానికి రంగం సిద్ధం

AP Population Policy | “పిల్లలే సంపద” పథకానికి రంగం సిద్ధం
AP Population Policy | యాదమరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
తగ్గుతున్న జననాల రేటుపై ప్రభుత్వ ఆందోళన
పోషణ, శిక్ష, సురక్షపై ప్రత్యేక దృష్టి
యువ జనాభానే భవిష్యత్ అభివృద్ధికి బలం
AP Population Policy | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జననాల రేటు, భవిష్యత్తులో ఏర్పడే కార్మికుల కొరత, వృద్ధాప్య జనాభా పెరుగుదల వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో “పిల్లలే సంపద” పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu శనివారం చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ పథకం కింద మూడవ బిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం, నాలుగవ బిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.40 వేల ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. వెబ్‌సైట్ కూడా సిద్ధమైంది.
ఈ పథకానికి “పిల్లలే సంపద” అని పేరు పెట్టారు. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా యాదమరి పర్యటన సందర్భంగా లాంఛనంగా ప్రకటించనున్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా జననాల రేటు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
మూడు ప్రధాన అంశాల ఆధారంగా..
“పిల్లలే సంపద” కార్యక్రమాన్ని ప్రభుత్వం మూడు ప్రధాన స్తంభాల ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. పోషణ, శిక్ష, సురక్ష అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గర్భిణులు, చిన్నారులకు పోషకాహార భద్రత, పిల్లలకు నాణ్యమైన విద్య, కుటుంబాలకు ఆరోగ్య రక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.
పథకం అమలులోకి వచ్చిన తర్వాత జన్మించిన మూడవ లేదా నాలుగవ బిడ్డలకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంది. పూర్తి విధివిధానాలు, అర్హత నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియ, ఆన్‌లైన్ పోర్టల్, నగదు బదిలీ విధానం వంటి అంశాలపై ప్రభుత్వం ఇంకా అధికారిక మార్గదర్శకాలను విడుదల చేయలేదు. యాదమరి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
