ఆహారభద్రత చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలి
మోత్కూర్, ఆంద్రప్రభ: 2013లో వచ్చిన ఆహారభద్రత అంత్యోదయ కార్డులను సవరించి పేదలకు ఇస్తున్న 35 కేజీల బియ్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ, ఒక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలనే చట్ట సవరణను వ్యవసాయ కార్మిక సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అన్నారు. మంగళవారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఆహారభద్రత పోషకహారం ప్రజాపంపిణి గురించి మోడీ ప్రభుత్వం గొప్పగా చెపుతున్నప్పటికి , దేశంలో ఆకలి దారిద్యం పెరుగుతుందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆహారభద్రత చట్టాన్ని సవరణ చేసి దారిద్యరేఖకు దిగువన ఉన్న పేదలకు బువ్వను దూరం చేసే విధానం అవలంభిస్తుందన్నారు. ప్రజా పంపిణి వ్యవస్థను పటిష్టం చేసి, ప్రజా పంపిణి ద్వారా 16 రకాల సరుకులను అందించి ఆదుకోవలసిన మోడీ ప్రభుత్వం, పేదలకు బువ్వను దూరం చేస్తుందని విమర్శించారు. 2013 లో ఆహారభద్రత చట్టాన్ని, 2005 లో ఉపాధిహామీ చట్టాన్ని పోరాడి సాధించుకుంటే ఆ చట్టాలను సవరణల పేరుతో నిర్వీర్యం చేస్తుందన్నారు. పేదలపక్షాన పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకునేందుకు, మోడీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండకట్టి, పేదలను ఐక్యంచేసి పోరాటలను నిర్వహిస్తామన్నారు.
