Kurnool రైతులకు ఎస్పీ హెచ్చరిక..

Kurnool రైతులకు ఎస్పీ హెచ్చరిక..

  • ఎరువులు, సబ్సిడీల పేరుతో వచ్చే నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి

కర్నూలు (Kurnool), ఆంధ్రప్రభ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ, నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్, వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, లింకుల ద్వారా రైతుల వ్యక్తిగత, బ్యాంకు వివరాలను సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు.

రైతులు విత్తనాలను లైసెన్స్ పొందిన డీలర్లు, గుర్తింపు పొందిన దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో ప్యాకెట్‌పై ఉన్న కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, ధ్రువీకరణ వివరాలను పరిశీలించి, తప్పనిసరిగా బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. విత్తనాల కొనుగోలు, నమోదు ప్రక్రియల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన d-Krishi యాప్‌ను మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఎరువుల కొనుగోలు కోసం అమలులో ఉన్న APAIMS (Andhra Pradesh Agricultural Inputs Management System) విధానాన్ని మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

అనధికార యాప్‌లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మరాదని హెచ్చరించారు. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదన్నారు. ప్రభుత్వ శాఖలు ఎప్పుడూ ఫోన్ ద్వారా ఇటువంటి వివరాలను అడగవని గుర్తుంచుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులు పంపిన ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా లేదా అనధికార వ్యక్తుల ద్వారా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేయరాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలు, ఎరువుల పంపిణీ, రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కోసం సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను లేదా అధికారిక ప్రభుత్వ వేదికలను మాత్రమే సంప్రదించాలని రైతులకు సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే నకిలీ విత్తనాలు, అక్రమ విక్రయాలు, మోసపూరిత సందేశాలు లేదా ఫోన్ కాల్స్ గురించి వెంటనే సమీపంలోని మండల వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ తెలిపారు. “అప్రమత్తతే రక్షణ. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే వినియోగిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రైతులు నకిలీ విత్తనాలు, సైబర్ మోసాల బారిన పడకుండా ఉండగలరు” అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

Leave a Reply