వడదెబ్బ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వడదెబ్బ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- ముఖ్య సూచనలు పాటించాలని పిహెచ్సి వైద్యాధికారి సూచన
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండల ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నల్లబెల్లి పిహెచ్సి వైద్యాధికారి డా. పీ.బి. ఆచార్య సూచించారు.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అవసరం లేనప్పుడు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని తెలిపారు.ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు భానుడి ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
బయటకు వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో ఉదయం 10 గంటలలోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పనులు ముగించుకోవాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండి నీడలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా వడదెబ్బ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు.అదేవిధంగా ప్రజలు కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూచనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యాధికారి తెలిపారు.రోజుకు ఎక్కువసార్లు నీరు,ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవడం,మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండడం, తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం అవసరమన్నారు.
కాటన్ దుస్తులు ధరించి తలకు కప్పు ఉపయోగించడం,చిన్నారులు,వృద్ధులను ఎండలోకి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తలనొప్పి,వాంతులు,అలసట వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు. వడదెబ్బ, డయేరియా వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య చికిత్స పొందాలని తెలిపారు.మండల ప్రజలు ఈ సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నల్లబెల్లి పిహెచ్సి వైద్యాధికారి డా. పీ.బి. ఆచార్య కోరారు.
