యువశక్తి సమాజ సేవకు అంకితం కావాలి

  • టీడీపీ యువత ఆధ్వర్యంలో శ్రమదానం
  • మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన యువత జీవితాలతో వైసీపీ చెలగాటం
  • టీడీపీ నేత గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, ఆంధ్రప్రభ: యువత కేవలం రాజకీయాలు, ఉద్యోగాలు, చదువులకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావాలని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఇంటర్నేషనల్ యూత్ దినోత్సవం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో 11వ డివిజన్ పరిధిలోని దొంతిరెడ్డి మల్లేశ్వరి పార్కులో టీడీపీ యువత నాయకులు గద్దె క్రాంతి కుమార్, కిలారు శ్రవణ్ శ్రవణ్ ఆధ్వర్యంలో స్వయంగా శ్రమదానం చేసి పార్కులో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, ఇతర వ్యర్థాలను తొలగించారు.

అనంతరం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాలతో డివిజన్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తే సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చన్నారు. “యువత ఆలోచిస్తే మార్పు వస్తుంది.. యువత అడుగు వేస్తే అభివృద్ధి జరుగుతుంది.. యువత సేవ చేస్తే సమాజం బాగుపడుతుంది” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి పైగా యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లభిస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ నియామక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిన వైకాపా వారు నేడు దొంగ ధర్నాలు చేయడం తగదన్నారు.

తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగ శ్రవణ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. వైకాపా వారు జెన్ జి పేరుతో నిర్వహిస్తున్న ధర్నాల్లో చదువుకున్న యువత, నిజమైన నిరుద్యోగులు కనిపించకపోవడం చూస్తే అవి ఎంత రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఐదేళ్లపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువత జీవితాలను నాశనం చేశారన్నారు.

“మన ప్రాంతం – మన బాధ్యత” అనే స్ఫూర్తితో టీడీపీ యువత ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల రాజేష్, కోనేరు రాజేష్, కొల్లి రోహిత్, రాము, బసవయ్య, సీతారాములు, తాడి బాబురావు, హనీఫ్, పీవీర్ నాయుడు, నాని సుశీల్, బండి సాయి రామ్, పెద్ది శరత్, అఖిల్, సాయి తదితరులు ఉన్నారు.