ఆషాఢ సారెలో అరుదైన ఘనత
- నెల రోజుల్లో 6 లక్షల మందికి పైగా సారె సమర్పణ
- ఆషాఢ సారెకు భక్తజన సందోహం
- దశాబ్ద కాలంలోనే అత్యధికం
- నాలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
- తొలిసారి సారె బృందాల రిజిస్ట్రేషన్
- సాఫీగా సాగిన ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాలు రికార్డు స్థాయిలో ముగిశాయి. జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు నెల రోజులపాటు నిర్వహించిన ఉత్సవాల్లో 6 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు దేవస్థానం అంచనా వేసింది. గత పదేళ్ల సారె సమర్పణ చరిత్రలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.

కళకళలాడిన ఆలయం..
ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో కళకళలాడింది. సాధారణ రోజుల్లో రోజుకు సగటున 15 వేల మందికిపైగా భక్తులు సారె సమర్పించగా.. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 85 వేలు దాటింది. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి ఈవో వి.కె. శీనా నాయక్ పర్యవేక్షణలో చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలిచ్చాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు కూడా ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు.
నాలుగు రాష్ట్రాల నుంచి సారె బృందాలు..
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో సారె బృందాలు తరలివచ్చాయి. గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, కుల, ఉద్యోగ సంఘాలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సంభారాలను సమర్పించారు.

తొలిసారి రిజిస్ట్రేషన్.. సులువైన నిర్వహణ…
భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ ఏడాది తొలిసారిగా సారె బృందాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను దేవస్థానం అమలు చేసింది. ఏ బృందం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకోవడంతో క్యూ నిర్వహణ, భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడం సులువైందని అధికారులు తెలిపారు. సారె సమర్పించిన భక్తులకు ప్రత్యేకంగా ఉచిత సత్వర దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం పండితులచే సామూహిక వేద ఆశీర్వచనం అందించారు. భక్తులకు అన్నప్రసాదం, ఉచిత ప్రసాదాల పంపిణీ కొనసాగించారు. రికార్డు స్థాయిలో ఉత్సవాలను విజయవంతం చేసిన వైదిక బృందం, ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ, మీడియా ప్రతినిధులు, భక్తులకు ఈవో వి.కె. శీనా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

