Meeting | ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై చర్చ
Meeting | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ, యుటిలిటీల బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో భారత వాయుసేన ఎయిర్పోర్ట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కార్గో సదుపాయాలు, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్), హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఇటీవల మధ్యప్రాచ్య ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లను ఏర్పాటు చేసుకునేందుకు అనువైన కేంద్రంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్డీఎల్ ఎంపిక చేసిన ప్రదేశంలో ప్రతిపాదిత కీలక ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.
