గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవల విస్తరణకు ప్రభుత్వం కృషి

దసరాకల్లా పెద్దపల్లి బస్ డిపో ప్రారంభిస్తాం : ప్రభుత్వ విప్ విజయరమణరావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు.

శనివారం పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పెద్దపల్లి నుంచి చొప్పదండి వరకు నడిచే నూతన ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం తుర్కల మద్దికుంట నుంచి జూలపల్లి వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ, వచ్చే దసరా నాటికి పెద్దపల్లి ఆర్టీసీ బస్ డిపోను ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త బస్సు ప్రారంభంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ చరిత్రలో పెద్దపల్లి బస్ డిపో పేరును నమోదు చేసే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రజా ప్రభుత్వంలోనే పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని చెప్పారు.

గత ప్రభుత్వాలు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కొత్త బస్ డిపో ఏర్పాటుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాజధాని హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా అనుసంధానం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులకు మంచి పంటలు పండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.