జాతీయ రహదారిపై బీజేపీ సర్కారు మోసపూరిత ప్రకటనలు

జాతీయ రహదారిపై బీజేపీ సర్కారు మోసపూరిత ప్రకటనలు

  • మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : 2016లోనే మంజూరైన జాతీయ రహదారిని, ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆమోదించినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితంగా ఎన్.హెచ్-563 మంజూరైందని, అప్పుడే టెండర్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు.

గతంలోనే భూసేకరణ, పరిహారం చెల్లింపులు కూడా జరిగాయని, కరీంనగర్-వరంగల్ మధ్య పనులు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అప్పటికే మంజూరైన పనులను తామే కొత్తగా తెచ్చినట్లుగా బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా, పదే పదే పనులు ప్రారంభించామంటూ ఎంపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఈ మోసపూరిత ప్రకటనలను గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ లబ్ధి పొందడం తగదని ఆయన హెచ్చరించారు.

Leave a Reply