బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్టు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ నిరసనకు వెళ్తుండగా పోలీసుల అదుపులోకి
మక్తల్, ఆంధ్రప్రభ: బీజేవైఎం నాయకులను నారాయణపేట జిల్లా మక్తల్ పోలీసులు శనివారం ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి వెళ్లేందుకు బయలుదేరిన మక్తల్ బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మక్తల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టయిన వారిలో 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పీకే నర్సింహా, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఆర్. మంజునాథ్, వన్నవాడ శ్రీకాంత్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు కుర్వ లింగం, బ్యాటరీ రాజు, రాజా గౌడ్, కల్లూరి ఆంజనేయులు, సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి పాపిరెడ్డి, జావీద్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే నిరసనలను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులకు పాల్పడడం సరికాదన్నారు.
పోలీసులు అడ్డుకున్నంత మాత్రాన తమ ఆందోళన ఆగదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
