రంగా పేదల పాలిట దేవుడు.. ఆయన ఆశయాలు చిరస్మరణీయం
నర్సాపురంలో ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి
నర్సాపురం, ఆంధ్రప్రభ: స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేదల పాలిట దేవుడని, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన 79వ జయంతి వేడుకలను శనివారం నర్సాపురంలో ఘనంగా నిర్వహించారు.
తొలుత కోటిపల్లి వారి వీధిలోని రంగా విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి “రంగా అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. తర్వాత నర్సాపురం మెయిన్ రోడ్డులోని రంగా సెంటర్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వంగవీటి మోహనరంగా చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సంకు భాస్కర్ నాయుడు, ఐటీడీపీ నాయకులు బోగిరెడ్డి ముత్యం, కోటిపల్లి బ్రహ్మానందం, బండారు రాజేంద్ర నాయుడు, మచ్చెట్టి శివాజీ, పండ్ల వర్తకులు భద్రరావు, పెద్దిరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రంగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
