కలెక్టరేట్ ముట్టడించిన పరకాల మున్సిపల్ కార్మికులు

పరకాల, ఆంధ్రప్రభ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పరకాల మున్సిపాలిటీ కార్మికులు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఐటీయూ పరకాల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులను 60 ఏళ్లు నిండిన కారణంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. తొలగించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని కోరారు. అలాగే అద్దె ఇళ్లు, గుడిసెల్లో నివసిస్తూ మున్సిపాలిటీలోని 22 వార్డులకు సేవలందిస్తున్న కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం అయినా స్పందించి న్యాయం చేయాలని కోరారు.

తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసిన కార్మికులు, ఈ నెల 29న ఎమ్మెల్యేల ఇళ్లను, 30న మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ సీఐటీయూ నాయకులు, పరకాల కార్మిక సంఘం నాయకులు బొచ్చు ఐలయ్య, పసుల సారయ్య, చెరుకు నాగరాజ్, మంద మహేష్, సాంబరాజు, కిషోర్, సతీష్, గుర్రం సరోజన, మడికొండ వసంత, దుప్పటి తిరుమలతో పాటు మున్సిపల్ జవాన్లు, వాటర్ సప్లై, కరెంట్ సప్లై, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.