పరకాల మహిళల ఉపాధికి నిరంతర కృషి
పరకాల మహిళల ఉపాధికి నిరంతర కృషి
పరకాల, ఆంధ్రప్రభ:
పరకాల పట్టణంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో ముచ్చటించి, వారికి అందుతున్న శిక్షణ, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు. శిక్షణా కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించిన వారు, మహిళలకు మరింత నాణ్యమైన శిక్షణ అందించే దిశగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన ఎంతో ముఖ్యమని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పోచంపల్లి ఫౌండేషన్ కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ఆ పరిశ్రమలో పరకాల నియోజకవర్గ మహిళలకు తొలి ప్రాధాన్యత దక్కేలా కృషి చేస్తున్నామని, అందుకోసమే ముందస్తుగా మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు, పోచంపల్లి ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
