ఘనంగా క్లస్టర్ వైస్ మహానాడు ప్రారంభం
ఘనంగా క్లస్టర్ వైస్ మహానాడు ప్రారంభం
హైబ్రిడ్ మోడ్‌లో 10 క్లస్టర్లలో ప్రత్యక్ష ప్రసారం
పామర్రు, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గవ్యాప్తంగా 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వర్చువల్‌గా మహానాడును ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళిగా మౌనం పాటించారు.
పామర్రు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు క్లస్టర్–6 పరిధిలో టూ-వే కమ్యూనికేషన్ ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “కార్యకర్తే పార్టీకి బలం” అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌ను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు. అమరులైన కార్యకర్తల త్యాగాలు వృథా కాకుండా పసుపు జెండాను రెపరెపలాడించాలన్నారు.
హైబ్రిడ్ విధానంలో 10 క్లస్టర్లలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా మహానాడు నిర్వహించామని తెలిపారు. ప్రతి క్లస్టర్‌లో కార్యకర్తలకు ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
క్లస్టర్ల వివరాల ప్రకారం పామర్రు మండలంలో 3, తోట్లవల్లూరు మండలంలో 2, పమిడిముక్కల మండలంలో 2, పెదపారుపూడి మండలంలో 1, మొవ్వ మండలంలో 2 చొప్పున మొత్తం 10 క్లస్టర్లలో కార్యక్రమం నిర్వహించారు. ఏసీ కళ్యాణ మండపాల్లో డిజిటల్ స్క్రీన్లు, భోజన సదుపాయం, స్నాక్స్, చల్లని మజ్జిగ వంటి ఏర్పాట్లు చేశారు.
మహానాడు జరిగే ప్రాంతాలన్నీ పార్టీ జెండాలు, తోరణాలతో పసుపుమయంగా మారినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, కుటుంబ సాధికార సారథులు, తెలుగు మహిళలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
