వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
- మధ్యవర్తుల్లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు
- తేమ, కొలతల ప్రమాణాలు పాటించాలి..
- అధికారులకు ఆదేశాలిచ్చిన ఎమ్మెల్యే గండ్ర…
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మండలంలోని వేషాలపల్లి, కాసింపల్లి, గొర్లవేడు, వజినపల్లి, నేరేడు పల్లి, గుడాడ్ పల్లి, కొంపల్లి, పుల్లూరి రామయ్య పల్లి గ్రామాల్లో పి.ఎ.సి.ఎస్–ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర రూ. 2,389తో పాటు అదనంగా రూ. 500 బోనస్ అందజేస్తామని తెలిపారు.
కోత యంత్రాల వినియోగంలో రైతులు, యంత్ర యజమానులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా కోత మిషన్ల ఆర్పిఎం 18 నుండి 20 మధ్య ఉంచడం, బ్లోయర్ ఆన్‌లో ఉండేలా చూసుకోవడం వల్ల ధాన్యంలో తాలు లేకుండా నాణ్యత మెరుగు పడుతుందని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని, ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్ఓ, డీఎం, వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
