చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్…
ఆంధ్రప్రభ : చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల కావస్తుంది. అయితే, ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాహ్నవి) కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ వెనుక ఒక కియా (KIA) కారు ఉన్నట్లు వస్తున్న ఆధారాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలు ఇప్పుడు ఈ కేసులో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజున, అంతకుముందు రెండు రోజుల పాటు సదరు గ్రామంలో ఒక కియా కారు అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ కారు, అందులో ఉన్న వ్యక్తుల ప్రవర్తనపైనే తమకు పూర్తి అనుమానాలు ఉన్నాయని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆ కారులో వచ్చిన వారు పాపను కిడ్నాప్ చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. సీహెచ్ అగ్రహారంలో అనుమానాస్పదంగా తిరిగిన అదే కియా కారు, నర్సీపట్నం పరిసర ప్రాంతంలో చిన్నారికి సంబంధించిన ఒక క్లోజ్ బంధువును ఢీకొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావాలనే భయాందోళనలకు గురిచేయడానికి లేదా సమాచారం బయటకు రాకుండా ఉండేందుకే ఆ కారుతో బంధువును ఢీకొట్టారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన సదరు కియా కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? నర్సీపట్నంలో జరిగిన ప్రమాదానికి, ఈ కిడ్నాప్‌నకు ఏమైనా లింకు ఉందా? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. నెల రోజులుగా చిన్నారి ఆచూకీ దొరక్క ఆందోళనలో ఉన్న కుటుంబానికి, ఈ కారు మిస్టరీ వీడితే కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
