హామీలకే పరిమితమైన ఆధునికీకరణ
- మూడు ప్రభుత్వాలు మారినా మారని పరిస్థితి
- కూటమి సర్కారుపైనే ఇప్పుడు ఆశలు
మాచర్ల, ఆంధ్రప్రభ : పనులన్నీ చేసుకుంటూ పోతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేందుకు ఏమీ మిగలదేమోనన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రాజకీయ నాయకులపై తరచూ వినిపిస్తుంటాయి. ఎన్నికలు సమీపిస్తే హామీల జోరు.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల ఊసే కరవు. పల్నాడు ప్రాంతానికి అత్యంత కీలకమైన బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆధునికీకరణ కూడా ఇలాంటి హామీల జాబితాలోనే మిగిలిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మారినా బుగ్గవాగు పరిస్థితిలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కే ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ పల్నాడులోని అనేక గ్రామాలు తాగు, సాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వేసవి వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి. బోర్లు అడుగంటడం, ట్యాంకర్లతో నీటి సరఫరా చేయడం వంటి తాత్కాలిక చర్యలు చేపట్టినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. వర్షాలు ముఖం చాటేస్తే పచ్చని పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కొంత వరకు శాశ్వత పరిష్కారం చూపగల సామర్థ్యం ఉన్న బుగ్గవాగు మాత్రం ఏళ్లుగా పూడికలోనే మగ్గుతోంది.

ఎక్కడిదీ బుగ్గవాగు?
మాచర్ల సమీపంలోని దుర్గి మండల పరిధిలో బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. నాగార్జునసాగర్ కుడి కాలువకు అనుసంధానంగా ఉన్న ఈ రిజర్వాయర్ నిర్మాణం 1960ల నాటిది. సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడేలా దీనిని నిర్మించారు.
బుగ్గవాగు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.463 టీఎంసీలు కాగా, డెడ్ స్టోరేజీ సుమారు 1.698 టీఎంసీలు. అంటే ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించి, నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే మరింత నీటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని సుమారు 5 టీఎంసీల వరకు పెంచే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
వరదల సమయంలో సముద్రంలోకి లేదా దిగువ ప్రాంతాలకు వృథాగా వెళ్లిపోయే నీటిలో కొంత భాగాన్ని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తే పల్నాడుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మాచర్ల, గురజాల, వినుకొండ ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడంలో బుగ్గవాగు కీలకంగా మారే అవకాశం ఉంది.
హామీల వరద.. పనుల కరవు
బుగ్గవాగును ఆధునికీకరిస్తామని ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ హామీలు వినిపిస్తూనే ఉన్నాయి. రిజర్వాయర్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కూడా పలుమార్లు ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.
2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి తాగునీరు అందించే ప్రణాళికను రూపొందించినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా బుగ్గవాగు ఆధునికీకరణతో పాటు మాచర్లకు తాగునీటి సరఫరాపై హామీలు ఇచ్చింది. పాలన చివరి దశలో ఆధునికీకరణ పనులకు రూ.200 కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరిగినా పనులు మాత్రం ముందుకు సాగలేదు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా బుగ్గవాగు ఆధునికీకరణను ఎన్నికల హామీల్లో ప్రస్తావించింది. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి స్థానిక అభ్యర్థుల వరకు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ కార్యరూపం దాల్చలేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు.. కానీ బుగ్గవాగు పరిస్థితి మాత్రం మారలేదు.
జల్ జీవన్ మిషన్.. వాటర్‌గ్రిడ్‌కు బుగ్గే ఆధారం?
ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్‌తో పాటు, గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు చేపడుతున్న ఇతర పథకాలు సక్రమంగా అమలు కావాలంటే నీటి వనరుల స్థిరత్వం కీలకం.
పల్నాడు ప్రాంతంలో భారీ వ్యయంతో ప్రతిపాదించిన వాటర్‌గ్రిడ్, పైప్‌లైన్ ఆధారిత పనులు ప్రారంభమైనా తాగునీటి సరఫరా కార్యక్రమాలకు కూడా బుగ్గవాగు వంటి నీటి వనరుల సామర్థ్యం పెంపు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.పథకాలకు నిధులు కేటాయించడం ఒక ఎత్తయితే.. వాటికి అవసరమైన నీటి వనరులను బలోపేతం చేయడం మరో ఎత్తు. బుగ్గవాగు ఆధునికీకరణ లేకుండా తాగునీటి పథకాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించడం ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న.
కూటమి సర్కారుపై కొత్త ఆశలు..
మూడు వరుస ప్రభుత్వాల హామీల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బుగ్గవాగు ఆధునికీకరణపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. బుగ్గవాగు ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే ప్రాంతాల్లో మాచర్ల, గురజాల నియోజకవర్గాలు ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి బుగ్గవాగు ఆధునికీకరణ ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు బుగ్గవాగుకు దక్కింది హామీలే. ఈసారి మాత్రం హామీ నుంచి కార్యాచరణ వైపు అడుగులు పడతాయా అన్నదే ప్రశ్న.
మాటలకు మించి.. పనులు కావాలి..
బుగ్గవాగు ఆధునికీకరణ అనేది ఒక్క రిజర్వాయర్ అభివృద్ధి సమస్య కాదు. ఇది పల్నాడు ప్రాంతంలోని తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు, వ్యవసాయం, గ్రామీణ జీవన విధానంతో ముడిపడిన అంశం. ఏళ్లుగా పూడికతో కుంచించుకుపోతున్న నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, కాలువ వ్యవస్థను ఆధునికీకరించడం, తాగునీటి పథకాలతో అనుసంధానం చేయడం వంటి చర్యలు చేపడితే బుగ్గవాగు పల్నాడుకు వరప్రదాయినిగా మారే అవకాశం ఉంది.
ఎన్నికల వేళ బుగ్గవాగు పేరు వినిపించడం కాదు.. ప్రాజెక్టు వద్ద యంత్రాలు మోగాలి.
ఇప్పటికే ఎన్నో హామీలు విన్న పల్నాడు ప్రజలు ఈసారి మాటలను కాదు.. మొదలయ్యే పనులను చూడాలనుకుంటున్నారు.
బుగ్గవాగు బాగుపడుతుందా..?లేక మరోసారి హామీల వాగులోనే కొట్టుకుపోతుందా..?అన్నది వేచి చూడాల్సిందే.

