ఎన్టీఆర్ మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకం..

ఎన్టీఆర్ మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకం..
– కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సేవలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో బి. శివన్నారాయణ రెడ్డి తదితర అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమానికి అనేక వినూత్న పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తెలుగు సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడిగా ఎన్టీఆర్ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
ప్రజా సేవకు ఎన్టీఆర్ చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వరరావు, డిటి ఎం. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
