హనుమాన్ జంక్షన్‌లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

హనుమాన్ జంక్షన్‌లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ: నేటి రైతు సాధికారతకు నాటి ఎన్టీఆర్ సంస్కరణలే మూలమని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను హనుమాన్ జంక్షన్‌లో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక చిల్లింగ్ సెంటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి చైర్మన్ చలసాని ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సమితి మహిళా పాడి రైతులు, ఆటోరిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. సమాజ సేవే మహానేతకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. రైతు, కార్మికుడు, సామాన్యుడు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ విధానాలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.

సహకార రంగ బలోపేతానికి ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయని అన్నారు. రైతులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ “రైతు ఉత్పత్తికి రైతే యజమాని” అనే భావనతో తీసుకొచ్చిన మాక్స్ చట్టం సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

ఆ మహానేత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ పనిచేస్తోందని తెలిపారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర చెల్లించడంతో పాటు ధర వ్యత్యాసం, పశు సంక్షేమ కార్యక్రమాలు, రైతు అభివృద్ధి పథకాల ద్వారా లక్షలాది పాడి రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతున్నామని వెల్లడించారు.

ఎన్టీఆర్ కలగన్న రైతు సాధికారత, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఆయన స్ఫూర్తితో రైతుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేస్తామని చలసాని ఆంజనేయులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల సంఘం అధ్యక్షులు, సమితి అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply