చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం…

చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం…
భవానిపురం, ఆంధ్రప్రభ : అరుదైన నాడీమండల వ్యవస్థ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారి రిషి కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం సమాజంలోని ప్రతి పౌరుడూ బాధ్యత తీసుకోవటం కోసం ముందుకురావాలని కె.బి.ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టి.శ్రీనివాసు అన్నారు. కెబిఎన్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం, రెడ్ రిబ్బన్ క్లబ్చ, వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ‘స్వచ్ఛంద విరాళాల సేకరణ’ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. శ్రీనివాసు మాట్లాడుతూ చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం అందించేందుకు తమ కళాశాల విద్యార్థులు స్వచ్ఛంగా ముందుకు వచ్చారని, వీలైనంత సహాయాన్ని విద్యార్థులు చేస్తున్నట్లు చెప్పారు.

హిందూ హై స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ సుమారు రూ.18 కోట్లు ఖర్చయ్యే వైద్యం నిమిత్తం తమ సంస్థ పక్షాన సహాయం చేస్తున్నామన్నారు. కాలేజీ ఎన్.ఎస్.ఎస్ విభాగ విద్యార్థులు కళాశాల పరిసర ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు స్వచ్ఛందంగా అందించిన విరాళాన్ని సేకరించి, రిషి కుమార్ తల్లిదండ్రులకు అందజేస్తామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి తొలిగా తనవంతు విరాళాన్ని ఇచ్చి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ శాంతిబాబు, డి.పవన్, గౌతమీదేవి, ఎన్. సాంబశివరావు, వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫౌండర్ ఏలూరి లీలాకుమారి, సభ్యులు వీరవనిత, ఎం.కమలాకర్, రిషి కుమార్ తండ్రి ముని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
