ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఉచిత సహాయం: ఎం.ఎ. షాహిద్

బాల్కొండ, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో మండల ప్రజలకు సహాయం అందిస్తున్నట్లు మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎం.ఎ. షాహిద్ తెలిపారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలు నింపడంలో ప్రజలకు సహకరిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌పై అవగాహన లేని వారికి ప్రత్యేకంగా సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు.

బాల్కొండ పట్టణంలో ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఉచితంగా ఫారాలు నింపించుకోవచ్చని సూచించారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు అని, ఎవరి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఇతర అవసరమైన పత్రాలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.