ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్..

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్..
తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానీయుడని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
తిరుపతి మహానగర అభివృద్ధికి ఎన్టీఆర్ విశేష కృషి చేశారని చెప్పారు. సిమ్స్, బర్డ్స్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేశారని, రూపాయికి కిలో బియ్యం పథకం ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. రాజకీయ పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా అవతరించడం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టమని తెలిపారు.
ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సైనికుల్లా పనిచేస్తామని పేర్కొన్నారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ పరిశీలకురాలు పర్వీన్ తాజ్ మాట్లాడుతూ.. మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించగా సుమారు 7.5 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. మహానాడులో 20 ప్రతిపాదనలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు జాతిలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణమ్మ, తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనర్ మహేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, పార్టీ నాయకులు బుల్లెట్ రమణ, రూపేష్ కుమార్, రాము, మన్నెం శ్రీనివాసులు పాల్గొన్నారు.
