Liquor Scam | ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట

  • లిక్కర్ కేసులో అరెస్టు కు బ్రేక్
  • ఈ అవకాశం నెలరోజులే
  • మళ్లీ హైకోర్టులో మిథున్ బంతి

ఆంధ్రప్రభ, న్యూఢిల్లీః వైసీపీ రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అప్పటికే మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన క్రమంలో ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా వాదనలు విని ముందస్తు బెయిల్‌పై నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. గతంలో మిథున్‌రెడ్డికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను కూడా సుప్రీంకోర్టు తొలగించింది. విచారణ సంస్థ చూపిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని మిథున్‌రెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గతంలో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన వేసిన పిటీషన్‌పై మంళవారం జస్టిస్ పార్ధీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకూ అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగు వారాల్లో మిథున్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Leave a Reply