కొత్తపూడిలో రైతుల ఆందోళన..

కొత్తపూడిలో రైతుల ఆందోళన..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని కొత్తపూడి గ్రామంలో పోర్ట్ విద్యుత్ లైన్ల ఏర్పాటుపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని నిలిచారు.

మచిలీపట్నం పోర్ట్‌కు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న హెవీ ఓవర్‌హెడ్ కరెంట్ లైన్లు, విద్యుత్ స్తంభాల మార్కింగ్ ప్రక్రియ రైతుల్లో ఆందోళన కలిగించింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా పొలాల మధ్య గుండా హై వోల్టేజ్ లైన్ల కోసం మార్కింగ్ చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో గురువారం గ్రామ రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. తమ జీవనాధారమైన పంట పొలాల మీదుగా భారీ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తే వ్యవసాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం రైతులతో మాట్లాడకుండా అధికారులు, కాంట్రాక్టర్లు ఏకపక్షంగా మార్కింగ్ చేపట్టడంపై రైతులు ప్రశ్నలు లేవనెత్తారు. తమకు సమాచారం ఇవ్వలేదని, పరిహారం విషయంపై కూడా స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలను పరిష్కరించాలని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Leave a Reply