ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

  • అభివృద్ధి, శాంతిభద్రతలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
  • కలిదిండి సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కలిదిండి (ఏలూరు బ్యూరో), ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఓ దౌర్భాగ్యపు పార్టీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ పార్టీ చర్యలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ప్రజల కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నా..

కలిదిండిలో జరిగిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నక్సల్స్ తనపై క్లైమోర్‌ మైన్లు పేల్చినా కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను, హైదరాబాద్‌లో మత విద్వేషాలను సమర్థంగా నియంత్రించిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో సంపద పెరిగి, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.

గంజాయి, రౌడీయిజంపై ఉక్కుపాదం..

రాష్ట్రంలో గంజాయి, రౌడీ బ్యాచ్‌ల కారణంగా గతంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టామని తెలిపారు. దేవరపల్లి వద్ద పొగాకు రైతుల పరామర్శకు వెళ్లిన సమయంలో కొందరు చేసిన హంగామాతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం అన్నారు. రోడ్లపై మోటార్‌సైకిళ్లతో ప్రమాదకరంగా సర్కస్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, రైతుల పొగాకును తొక్కేశారని ఆరోపించారు. పొగాకు రైతులకు కిలోకు రూ.10 సబ్సిడీతో పాటు బ్యారన్‌కు రూ.50 వేల రుణం అందించేలా కేంద్రంతో మాట్లాడామని వెల్లడించారు.

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించం..

గుంటూరులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేతను సస్పెండ్‌ చేసి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఎం తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి కుమారుడు బైక్‌తో ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ రాజకీయాలు చేసి అరాచకానికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రధాని పర్యటన సమయంలో రోడ్లపై గంటల తరబడి ర్యాలీలు నిర్వహించడం, మహిళా పోలీసు అధికారిపై దాడి చేయడం వంటి ఘటనలకు పాల్పడి, తిరిగి పోలీసులపైనే నెపం వేస్తున్నారని ఆరోపించారు.

మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు సరికాదు..

మెగా డీఎస్సీ ద్వారా 15 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని చంద్రబాబు తెలిపారు. పూర్తి మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన యువతను కించపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. డీఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చివరకు మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన టీచర్లు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఉపాధ్యాయుల ఆందోళనపై సీఎం వ్యాఖ్యలు..

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారని చంద్రబాబు పేర్కొన్నారు. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామని వారు హెచ్చరించినా సంబంధిత పార్టీకి బుద్ధి రాలేదని సీఎం వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనులపై రాజకీయాలు వద్దు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే అది తానే కట్టానని, పోలవరం పూర్తయితే అదీ తన ఘనతేనని, అమరావతి నిర్మాణం జరిగినా తానే చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు ఫలితాలు అందిస్తుంటే, కొందరు విధ్వంసానికి పాల్పడి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వదిలిపెట్టం..

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ, గంజాయి బ్యాచ్‌లను కట్టడి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. “ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించినా వదిలిపెట్టేది లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.