Indrakeeladri | తరలివచ్చే సారె..

రికార్డు స్థాయిలో కనకదుర్గమ్మకు ఆషాడ సారె
26వ రోజు 74 సారె బృందాలు..
28,653 మంది మహిళా భక్తుల రాక
ఆఖరి ఆదివారం భారీ రద్దీ..
అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం
అంతరాలయ, వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
భక్తులకు చల్లని నీరు, మజ్జిగతో ప్రత్యేక ఏర్పాట్లు
రద్దీ నియంత్రణపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన చైర్మన్‌, ఈవో


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : ఆషాఢ మాసం.. ఆషాఢ సారె ఉత్సవాల ముగింపు దశ.. వారాంతపు సెలవు.. ఆఖరి ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తజన ప్రవాహం కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు భారీగా తరలిరావడంతో కొండపై పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే ఘాట్‌రోడ్‌, శ్రీ కనకదుర్గ నగర్‌ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆషాఢ సారె 26వ రోజు రికార్డు స్థాయిలో 74 సారె బృందాల్లో 28,653 మంది మహిళా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో ఒకరోజు నమోదైన అత్యధిక సారె బృందాలు, భక్తుల సంఖ్య ఇదేనని దేవస్థానం అధికారులు తెలిపారు.

సామాన్య భక్తులకే పెద్దపేట…

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం నుంచే దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేసి అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన క్యూలైన్లుగా మార్చారు. అంతరాలయ దర్శనాలతో పాటు వీఐపీ దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యమిస్తూ దర్శన ఏర్పాట్లు చేశారు.

ఎండలోనూ ప్రత్యేక ఏర్పాట్లు..

భారీ రద్దీతో పాటు ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే సంచార నీటి డబ్బాల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. ఈవో వి.కె. శీనా నాయక్‌ స్వయంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శన సౌకర్యం కల్పించారు.

ప్రత్యేక ఏర్పాట్లు…

ఆషాఢ సారె సమర్పించిన మహిళా భక్తులకు ఉచిత దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదాల ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆరో అంతస్తులో అమ్మవారికి సారె సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. సారె బృందాల సభ్యులతో ఈవో శీనా నాయక్‌ మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించారు.

ఆదివారం వివరాలు ఇలా..

దేవస్థానం రోజువారీ గణాంకాల ప్రకారం ఆదివారం 69,419 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 6,839 దర్శన టికెట్లు జారీ కాగా, రూ.4,14,943 విరాళాలు లభించాయి. 11,7895 ప్రసాద యూనిట్లు, 316 సేవలు, 2,816 మంది తలనీలాలు సమర్పించగా, 13,410 మంది అన్నదానం స్వీకరించారు.

భక్తుల మధ్యే చైర్మన్‌, ఈవో…

భారీ రద్దీ నేపథ్యంలో దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, వన్‌టౌన్‌ పోలీసులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టారు. ఈవో వి.కె. శీనా నాయక్‌ క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. పాలకమండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

వైభవంగా సూర్యోపాసన సేవ..

ఇంద్రకీలాద్రిపై ఆదివారం సూర్యోపాసన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోకకల్యాణం, భక్తుల క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం వేద పండితులు అరుణ, మహాసౌర పారాయణాలతో పాటు సూర్య అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ ఆదిత్యునికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం కనకదుర్గమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో శీనా నాయక్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌ చంద్ర లడ్డా కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు చైర్మన్‌, ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

భక్తిరంజనితో ఆధ్యాత్మిక సందడి..

‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తిరంజని సంగీత విభావరి నిర్వహించారు. శ్రీ మల్లికార్జున మహామండపంలోని కళావేదికపై నాదస్వరం, డోలు, శాక్సోఫోన్‌ వాయిద్యాల సమ్మేళనంతో నిర్వహించిన గానకచేరీ భక్తులను ఆకట్టుకుంది. కళాకారులు ప్రముఖ సంకీర్తనలు, వర్ణనలను ఆలపించడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. కార్యక్రమం అనంతరం దేవస్థానం అధికారులు కళాకారులను సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.