ప్లీనరీని విజయవంతం చేయాలి
ప్లీనరీని విజయవంతం చేయాలి
- టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 12న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించనున్నట్టు తెలంగాణ జన సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ప్లీనరీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గజ్వేల్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన అభివృద్ధి, సామాజిక న్యాయం జరగలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. కాంట్రాక్టులు, కమిషన్లు, డబ్బు ఆధారిత రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిందని విమర్శించారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, ఎన్నికల సంస్కరణల లక్ష్యాలతో తెలంగాణ ఉద్యమ సారథి ఆచార్య కోదండరాం నేతృత్వంలో 2018 ఏప్రిల్ 29న తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన బోధించు, సమీకరించు, పోరాడు అనే పిలుపు, తెలంగాణ జాతిపిత ఆచార్య కె.జయశంకర్ స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందన్నారు.
ప్రజాస్వామిక, లౌకిక తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ కార్యాచరణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత అనుభవాలను సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర ప్లీనరీకి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
