30May 2026 | తిరుమల సమాచారం..

30May 2026 | తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ ఉధృతి
దర్శనానికి 34 గంటల వరకు నిరీక్షణ
30May 2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల పరీక్షలు ముగియడంతో భక్తుల రాక మరింత పెరిగింది. దీంతో తిరుమలలోని అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయి, టీటీడీ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది.
ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు 24 నుంచి 34 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అభిషేకం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవల సమయంలో భక్తులకు లఘుదర్శనం కల్పిస్తున్నారు. గత 15 రోజుల్లోనే సుమారు 12.50 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తులకు విస్తృత సౌకర్యాలు….
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా పాలు, మజ్జిగ, కాఫీ, టిఫిన్, సాంబారన్నం పంపిణీ చేస్తోంది. అలాగే ప్రతిరోజూ దాదాపు 4 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద భోజన వసతి కల్పిస్తోంది. రద్దీ కారణంగా కొంతమంది భక్తులు షెడ్లు, ఆరుబయట ప్రాంతాల్లో బస చేస్తున్నప్పటికీ, వారికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టైమ్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీ జూన్ 15 వరకు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
