Digital Revolution : దుర్గ గుడిలో,, డిజిటల్ విప్లవం Andhra Prabha Top News
Digital Revolution : దుర్గ గుడిలో,, డిజిటల్ విప్లవం Andhra Prabha Top News
- వాట్సాప్ క్యాష్ సేవలు
- దర్శనం, ప్రసాదం టిక్కెట్లు
- నగదు రహిత సేవల్లో కనకదుర్గ ఆలయం
- భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు సిద్ధం
(ఆంధ్రప్రభ, ఇంద్రకిలాద్రి)

Digital Revolution విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తులకు మరింత పారదర్శక, వేగవంతమైన సేవలు అందించేందుకు పూర్తిస్థాయి డిజిటల్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆలయ సేవలను “100 శాతం నగదు రహిత సేవల” దిశగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందన్నారు.

శుక్రవారం దేవస్థాన ఇంజినీరింగ్, ఐటీ, కౌంటర్లు, భద్రతా విభాగాల అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వెళ్తున్న భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులు ఆలయానికి రాకముందే లేదా కొండపై ఉన్నప్పటికీ తమ మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ ద్వారా దర్శనం టిక్కెట్లు, సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం టిక్కెట్లు, కళ్యాణకట్ట కేశఖండన టిక్కెట్లు తదితర సేవలను సులభంగా పొందేలా “వాట్సాప్ గవర్నెన్స్” విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆన్లైన్, వాట్సాప్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు శ్రీ కనకదుర్గ నగర్ మరియు ఘాట్ రోడ్డులోని ‘ఓం’ టర్నింగ్ వద్ద ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు.

ఈ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, క్యూఆర్ కోడ్ స్టాండ్లు, కంప్యూటర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని ఐటీ విభాగానికి సూచించారు. భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించేందుకు షిఫ్టుల వారీగా తగిన సిబ్బందిని విధుల్లో నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఐటీ నిపుణులు, కౌంటర్ల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ALSO READ :Kanaka Durga Train : కనక దుర్గ రైలుకు గ్రీన్ సిగ్నల్ Andhra Prabha News
