మూడు రోజుల్లో ముగ్గురు..

మూడు రోజుల్లో ముగ్గురు..

కొండూరు మండలంలో విషాదం
ఆగ‌ని కిడ్నీ మ‌ర‌ణాలు
పట్టించుకోని ప్రభుత్వం

ఎ.కొండూరు అక్టోబర్ 5 (ఆంధ్రప్రభ) : ఎ.కొండూరు మండలం కృష్ణారావు పాలెం గ్రామపంచాయతీ శివారు దీప్లానగర్ తండాకు చెందిన కిడ్నీ డయాలసిస్ వ్యాధిగ్రస్తుడు భరోతు ధర్మ (45) మంగళవారం రాత్రి చీమలపాడులోని వైష్ణవి ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య చెప్పిన వివరాల ప్రకారం కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా తన భర్త తనకు దక్కలేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది.

ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో వరస మరణాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, రెండు మూడు రోజుల వ్యవధిలోనే చైతన్యనగర్ లో బాణావతు రాముడు, దీప్లానగర్ తండాలో జరపల మంగ్యా నాయక్, భరోతు ధర్మ కిడ్నీ వ్యాధితో మృతి చెందినప్పటికీ ప్రభుత్వానికి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుందని మండల సీపీఎం నాయ‌కుడు పానెం ఆనందరావు విమర్శించారు.కిడ్నీ బాధితులకు సరైన వైద్యం అందక, పోషక ఆహారం తీసుకోకపోవడం వలన, కృష్ణా జలాలు అందుబాటులో లేకపోవడం వలన,ఈ మరణాలు సంభవిస్తున్నాయన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎ.కొండూరు మండలంలో కిడ్నీ మరణాలు ఆపాలని అందుకోసం ఎ. కొండూరులో కిడ్నీ ఆసుపత్రి వెంటనే నిర్మించాలని, వ్యాధిగ్రస్తులకు మందులు ఉచితంగా అందించాలని కోరారు. కృష్ణా జలాలు పైప్ లైన్ త్వరగా పూర్తి చేయాలని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2.0 క్రియాటిన్ దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం 10వేల రూపాయలను వీఆర్ ఓ రాణి చేతుల మీదగా అందజేశారు. భరోతు ధర్మా మృతదేహాన్ని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పానెం ఆనందరావు, సీపీఎం పార్టీ నాయకులు జెట్టి వెంకటేశ్వరరావు, ఆళ్ల అమ్మిరెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు మాళావతు కుమార్ నాయక్ సందర్శించి ఘనంగా నివాళులర్పించి, కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Leave a Reply