యూరియా యాప్ పై అవగాహన పెంపొందించుకోవాలి : ఛైర్మెన్
జైనూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ నిర్ణీత ధరకే రైతులకు ఎరువులు సరఫరా చేయాలన్న సదాశయంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ పై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. శుక్రవారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని గతంలో దళారులు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించేవారని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని గుర్తు చేశారు.
యూరియా యాప్ ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నియంత్రించడమే కాకుండా దుకాణాల వద్ద రోజువారీగా నిల్వ లు ఎంత మేర ఉన్నాయో ఎప్పటికప్పుడు యాప్ లోతెలుసుకోవచ్చన్నారు. రైతులు పట్టా పాసుపుస్తకాలు దళారులకు ఇస్తే యాప్ లో స్లాట్ బుక్ చేసి యూరియా పక్కదారి మలించే అవకాశముందన్నారు.. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ కేంద్రే శివాజీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పెందుర్ గణపత్ రావు, సర్పంచు విజయలక్ష్మి బీర్షావ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆత్రం నాగో రావు, సీ ఈ ఓ కనక రమేష్, అర్జున్ నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
