నంద్యాల రామకృష్ణ సంస్థకు జాతీయ సదస్సు ఆహ్వానం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల అత్యున్నత స్థాయి సమావేశంగా పేరుగాంచిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 100వ వార్షిక సాధారణ సమావేశం (Annual General Body Meeting), వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సుకు నంద్యాలలోని శ్రీ రామకృష్ణ విద్యాసంస్థకు ఆహ్వానం లభించడం విశేషమని ఆ సంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక సమావేశం మహారాష్ట్ర రాష్ట్రంలోని పింప్రి, పుణేలో ఉన్న డాక్టర్ డీ.వై. పాటిల్ విద్యాపీఠం విశ్వవిద్యాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా దేశంలోని 34 స్వయం ప్రతిపత్తి (అటానమస్) కళాశాలలకు ప్రత్యేక ఆహ్వానాలు అందగా, నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (అటానమస్) ఎంపిక కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇది తమ కళాశాల విద్యా ప్రమాణాలు, నిర్వహణా నైపుణ్యం, ఉన్నత విద్యలో అందిస్తున్న సేవలకు లభించిన గుర్తింపుగా భావించవచ్చని తెలిపారు.
ఈ సదస్సు ప్రధాన అంశం “నాలెడ్జ్ మరియు ఇన్నోవేషన్ ద్వారా స్వావలంబన భారత్ నిర్మాణం” కాగా, ఉన్నత విద్య రంగంలోని తాజా మార్పులు, విధానాలు, సవాళ్లు, అవకాశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని చెప్పారు. ఈ ఆహ్వానం ద్వారా తమ కళాశాల ప్రతిష్ట మరింత పెరుగుతుందని, అలాగే జాతీయ స్థాయిలో విద్యా రంగంలో తమ పాత్రను బలోపేతం చేసుకునే అవకాశం లభించిందని కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.
