అధికార పార్టీ పేరుతో దందా.. రెండోసారి రోడ్డెక్కిన బాధితులు

అధికార పార్టీ పేరుతో దందా.. రెండోసారి రోడ్డెక్కిన బాధితులు

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణంలో కబ్జా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు, వారి అనుచరులపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అధికార పార్టీ పేరును అడ్డం పెట్టుకుని కొందరు ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని 5వ వార్డులో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి, దొంగ పత్రాలు సృష్టించి లక్షలకు అమ్ముకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలా అక్రమంగా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఒక కుటుంబం తమ స్థలాన్ని కొందరు టీడీపీ నాయకులు కబ్జా చేశారంటూ పురుగుల మందు, కిరోసిన్ బాటిళ్లతో కబ్జాకు గురైన స్థలం వద్దే మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ ఘటన మరువకముందే మరో స్థలం కబ్జాకు గురైందంటూ మరికొందరు బాధితులు తమ స్థలం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వరుసగా రెండోసారి బాధితులు రోడ్డెక్కడం పట్టణంలో చర్చకు దారితీసింది.

కొందరు నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ల రూపంలో భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, స్థలాల కబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.