నంద్యాల బ్యూరో, జూన్ 9 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ఇవాళ ఉదయం సొమ్మసిల్లి కిందపడి అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలో భూమా సొంత గ్రామమైన దొర్నిపాడు (Dornipadu) మండలం డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో మూల పెద్దమ్మ జాతరను అట్టహాసంగా గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహిస్తున్నారు.
ఆ జాతరలో ఆమె పాల్గొన్నారు. జాతరలో ఆమె పాల్గొనడంతో అందరి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా ఆమె సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే భూమా అఖిల ప్రియను ఆళ్లగడ్డ (Allagadda ) లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఉపవాసం ఉండటంతో ఈ సంఘటన జరిగిందని వైద్యులు (Doctors) పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. భర్త భార్గవ్ రాముడు, తమ్ముడు జగన్ విఖ్యాత్ రెడ్డిలు ఆసుపత్రిలో ఆమె వెంటే ఉన్నారు. ఆమె బంధువులు, అభిమానులు ఆమె ఆరోగ్యంగా, సురక్షితంగా రావాలని కోరుకుంటున్నారు.