కార్మికులతో రైస్ మిల్ వేతన ఒప్పందం కుదిరింది

కార్మికులతో రైస్ మిల్ వేతన ఒప్పందం కుదిరింది

భీమవరం, ఆంధ్రప్రభ : భీమవరం తాలూకా రైస్ మిల్ కార్మికులకు, ది భీమవరం ప్యాడ్ అండ్ రైస్ మర్చంట్ అసోసియేషన్, భీమవరం రైస్ మిల్లర్ అసోసియేషన్, వీరవాసరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యాజమాన్యాల మధ్య వేతన ఒప్పందం కుదిరిందని సీఐటీయూ జిల్లా రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి. వాసుదేవరావు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న వేతనాలపై 10 శాతం పెంపు ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో భీమవరం తాలూకా రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) విస్తృత సమావేశం పి. సంసోను అధ్యక్షతన గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ, కార్మికుల ఐక్య పోరాట ఫలితంగా వేతన ఒప్పందం సాధించుకున్నామని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల కార్మికులకు నెలకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వేతన పెంపు కలుగుతుందని చెప్పారు. ఒప్పందం రెండు సంవత్సరాలు అమలులో ఉంటుందని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పరిశ్రమల పేరుతో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు అప్పగిస్తూ రైస్ మిల్ పరిశ్రమలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో రైస్ మిల్ రంగం కీలకమని పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాల మార్పుల కారణంగా రైస్ మిల్లులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసినా మిల్లులు 20 రోజులుగా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత లెవీ విధానాన్ని తిరిగి అమలు చేసి రైస్ మిల్ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల కార్మికులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని, వెంటనే ధరలు తగ్గించాలని కోరారు.

ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కే. సత్యనారాయణ, కే. సోమేశ్వరరావు, కలిదిండి గోపాలరాజు, నతానిలు, కృష్ణ, అప్పలస్వామి, శిడగం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply