కృష్ణా తీరంలో మహానాడు సందడి..

కృష్ణా తీరంలో మహానాడు సందడి..

150 అడుగుల భారీ కటౌట్ ఆకర్షణ
సీతమ్మవారి పాదాల వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాల ఆవిష్కరణ

కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా నది తీరంలోని సీతమ్మవారి పాదాల వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు సంబంధించిన 150 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఈ కటౌట్ ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు ఇదేనని తెలిపారు. యువ నాయకుడు లోకేష్ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రాజకీయ చరిత్రలోనే 150 అడుగుల కటౌట్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని చెప్పారు.

ఈసారి జూమ్ వేదికగా నిర్వహిస్తున్న మహానాడుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొంటారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడిని ఫ్యాక్షన్ రాజకీయాలతో అనుసంధానించడం సరికాదని, ఆయనది విజన్ రాజకీయమని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడి నాయకత్వంపై విమర్శలు చేసే ప్రత్యర్థుల వద్ద ఆధారాలు లేవని పేర్కొన్నారు. గత పాలనల్లో ఎదురైన రాజకీయ పరిణామాలను గుర్తుచేస్తూ, అన్ని ఆరోపణల నుంచి చంద్రబాబు క్లీన్‌గా బయటపడ్డారని అన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని బుద్ధా వెంకన్న కొనియాడారు.

Leave a Reply