చట్ట ఉల్లంఘించే స్కానింగ్, ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు

చట్ట ఉల్లంఘించే స్కానింగ్, ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు
ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ-పీఎన్‌డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్‌టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎం. సునీల్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు అందిన వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రస్తుతం అనుమతి ఉన్న స్కానింగ్ కేంద్రాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఐవీఎఫ్ సెంటర్ల విషయంలో సక్సెస్ రేట్, సేవల పారదర్శకతను దంపతులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రాల రెన్యువల్‌ను నిలిపివేయడంతో పాటు అవసరమైతే రద్దు చేయాలని హెచ్చరించారు.
సరోగసీకి సంబంధించిన ఆరు దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. కొత్త స్కానింగ్ కేంద్రాల అనుమతులు, రెన్యువల్, మార్పులు–చేర్పుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం. సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి. రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డా. పద్మజ, ఎన్‌హెచ్ఎం డీపీఎంవో డా. నవీన్ తదితరులు పాల్గొన్నారు.
