కులవృత్తుల పరిరక్షణకు కొత్త దారి..

కులవృత్తుల పరిరక్షణకు కొత్త దారి..

  • కులవృత్తుల కనుమరుగుతో సమాజం కోల్పోతున్న సంపద
  • యాంత్రీకరణ, మారుతున్న జీవనశైలి ప్రభావం
  • పాత వృత్తులకు కొత్త మార్కెట్‌, కొత్త అవకాశాలు
  • పర్యాటకం, నైపుణ్యాభివృద్ధితో కులవృత్తుల పునరుజ్జీవనం

మంగలి అంగళ్లు ఇప్పుడు ‘యునిసెక్స్‌ సెలూన్‌’ అయ్యాయి. కుమ్మరి వీధిలో ఇప్పుడు ప్లాస్టిక్‌ బిందెలు వేలాడుతున్నాయి. చాకలి బండ దగ్గర ఇప్పుడు వాషింగ్‌ మెషీన్‌ శబ్దం. అభివృద్ధి పేరుతో మనం ఒక తరం నైపుణ్యాన్ని, ఒక జాతి జ్ఞాపకాన్ని సమాధి చేస్తున్నాం. కులవృత్తులు కనుమరుగు కావడం అంటే కొన్ని పనులు ఆగిపోవడం కాదు, సమాజంలోని ఒక క్రోమోజోమ్‌ను తొలగించడం!

మనం అపోహలో ఉన్నాం. కులవృత్తి అంటే వివక్ష కాదు. అది ‘వంశపారంపర్య నైపుణ్య బదిలీ వ్యవస్థ‘. కాలేజీలో నేర్పని ఇంజనీరింగ్‌ను వడ్రంగి తన కొడుకుకు నేర్పాడు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేయకుండానే సాలెవాడు చీరకు ప్రాణం పోశాడు. మెడికల్‌ కాలేజీ మెట్లు ఎక్కకుండానే కాటికాపరి, నాటు వైద్యుడు బతుకుల్ని నిలబెట్టారు. ఈ వృత్తులు గ్రామానికి ‘సెల్ఫ్‌ సస్టెయిన్డ్‌ ఎకానమీ‘ని ఇచ్చాయి. కుమ్మరి కుండ ఇస్తే, రైతు ధాన్యం ఇచ్చాడు. మంగలి క్షవరం చేస్తే, యజమాని వడ్లు ఇచ్చాడు. డబ్బు అవసరం లేని ‘వస్తు మార్పిడి‘ వ్యవస్థ. ఇది కేవలం ఎకానమీ కాదు, ఎకాలజీ. సమాజం ఒక కుటుంబంలా బతికింది.

ఎందుకు కనుమరుగవుతున్నాయి?

యంత్రం దెబ్బతో మనిషి విలువ మంటగలిసింది. పవర్‌లూమ్‌ వచ్చాక చేనేత చచ్చిపోయింది. జేసీబీ వచ్చాక పార పట్టేవాడి పని పోయింది. ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ వచ్చాక కుండకు గిరాకీ లేదు. యంత్రం 100 మంది పని ఒక్కరోజులో చేస్తుంది. కానీ ఆ 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ‘చిన్న పని‘ అనే చిన్నచూపు మన చదువులు పిల్లలకు ‘వైట్‌ కాలర్‌ జాబ్‌‘ కలలు నేర్పాయి. కానీ ‘స్కిల్‌ ఈజ్‌ రెస్పెక్ట్‌‘ అని నేర్పలేదు. కుమ్మరి కొడుకు కుమ్మరి అవ్వాలంటే సిగ్గుపడుతున్నాడు. కటిక వాడి బిడ్డ ఇంగ్లీష్‌ మీడియం చదివి సిటీకి వలసపోతున్నాడు. వృత్తిని కాదు, వారసత్వాన్ని వదిలేస్తున్నాం.

ప్రభుత్వాల ‘పథకాల’ మాయ

చేనేతకు సబ్సిడీ ఇస్తారు, కానీ మార్కెటింగ్‌ ఉండదు. కుమ్మరికి ఉచిత మట్టి ఇస్తారు, కానీ కుండ కొనేవాడు ఉండడు. విశ్వకర్మ యోజన వచ్చింది, కానీ ట్రైనింగ్‌ ఇచ్చి వదిలేస్తున్నారు. ‘బతుకుతెరువు‘ ఇవ్వకుండా ‘బతిమాలుకునే‘ పథకాలు ఇస్తున్నారు. కోల్పోతున్నది ఏంటి? నష్టం కేవలం ఆర్థికం కాదు. నైపుణ్య వారసత్వం. పోచంపల్లి ఇకత్‌ డిజైన్‌, నిర్మల్‌ పెయింటింగ్‌, పెంబర్తి ఇత్తడి పని ఇవన్నీ పుస్తకాల్లో దొరకవు. తాత నుంచి మనవడికి వేళ్ల ద్వారా పాకే కళలు. ఈ తరం నేర్చుకోకపోతే, అవి మ్యూజియంలో శవాలు అవుతాయి.

పర్యావరణ విధ్వంసం

కుమ్మరి కుండ భూమిలో కలిసిపోతుంది. ప్లాస్టిక్‌ బిందె 500 ఏళ్లు కుళ్లదు. చాకలి వాడే చౌడు, కుంకుడు కాయ నీటిని కలుషితం చేయవు. సర్ఫ్‌ ఎక్సెల్‌ చేస్తుంది. కులవృత్తులు పోయి ‘పర్యావరణ విధ్వంసం‘ మిగిలింది. ఒకప్పుడు గ్రామంలో 18 వృత్తుల వాళ్లు ఉంటే, అది ఒక పరిపూర్ణ సమాజం. ఇప్పుడు అందరూ రైతు లేదా కూలీ. వైవిధ్యం లేని సమాజం, అడవి లేని భూమిలాంటిది. ఏ కష్టం వచ్చినా కూలిపోతుంది.

పరిష్కారం… ‘పాత’ వృత్తికి ‘కొత్త’ ఊపిరి

సానుభూతి కాదు, వ్యూహం కావాలి. ‘స్కిల్‌ టు స్కేల్‌‘: కుమ్మరి కుండలు చేయడం కాదు, ‘టెర్రకోట వాటర్‌ ఫిల్టర్లు‘, ‘డిజైనర్‌ డిన్నర్‌ సెట్స్‌‘ చేయించాలి. మంగలిని ‘హెయిర్‌ స్టయిలిస్ట్‌‘గా, చాకలిని ‘ఎకో ఫ్రెండ్లీ లాండ్రీ ఓనర్‌‘గా మార్చాలి. వృత్తి అదే, ఉత్పత్తి మారాలి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, వీరి ప్రొడక్ట్స్‌కు ప్రత్యేక సెక్షన్‌ ఉండాలి.

‘జియో ట్యాగింగ్‌’

జీఐ ట్యాగ్‌ … ప్రతి వృత్తికి, ప్రతి ఉత్పత్తికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌. ‘పోచంపల్లి‘ మాస్కోలో అమ్ముడైతే, పోచంపల్లి నేత బతకాలి. దళారులు కాదు.

పాఠశాలలో ‘పని’ పాఠం

6వ తరగతి నుంచే ‘వృత్తి విద్య‘ పాఠ్యాంశం పెట్టాలి. ఐఐఐటి ఫౌండేషన్‌ ఎంత ముఖ్యమో, కుండ చేయడం, నేత నేయడం నేర్పడం అంతే ముఖ్యం. ‘శ్రమకు గౌరవం‘ అనేది పుస్తకంలో కాదు, ప్రాక్టికల్‌గా నేర్పాలి.

పర్యాటకంతో అనుసంధానం

కులవృత్తి గ్రామాలు‘గా కొన్ని ఊళ్లను తీర్చిదిద్దాలి. టూరిస్ట్‌ వచ్చి, కుండ ఎలా చేస్తారో చూసి, తానూ ఒకటి చేసి, కొనుక్కుని వెళ్లాలి. ‘అనుభవం‘ అమ్మితే, వృత్తి బతుకుతుంది. జర్మనీ, జపాన్‌ లాంటి దేశాలు తమ ‘వంశపారంపర్య నైపుణ్యాన్నికాపాడుకుని ప్రపంచానికి అమ్ముకుంటున్నాయి. మనం మాత్రం ‘పాత చింతకాయ పచ్చడి‘ అని వదిలేస్తున్నాం.

కులవృత్తులు అంతరించిపోతే, మనం కోల్పోయేది కొన్ని పనులు కాదు, ‘మనం ఎవరు‘ అనే గుర్తింపును. ప్రభుత్వాలు మేల్కొనాలి. లేకపోతే రేపటి తరానికి గూగుల్‌లో ‘కుమ్మరి అంటే ఏంటి?‘ అని వెతకాల్సిన దుస్థితి వస్తుంది. అభివృద్ధి అంటే ఫ్లయ్‌ఓవర్లు కాదు, వేళ్లలో ఉన్న కళను ఫ్లయ్‌ చేయించడం. అది గుర్తుంచుకుంటేనే నిజమైన ‘బంగారు భవిష్యత్తు‘.

– ఉక్కల్‌ కర్‌ రాజేందర్‌ నాథ్‌