డీఎస్సీ అవకతవకలపై వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన
విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో చేపట్టిన ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కమల్ సాయి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం “దగా డీఎస్సీ” నిర్వహించిందని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అవినీతికి పాల్పడ్డారని, మెరిట్‌ను పక్కనబెట్టి డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు.
డీఎస్సీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ఈ అవినీతికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, డీఎస్సీ పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీపై విమర్శలు చేయడమే కూటమి ప్రభుత్వ పనిగా మారిందన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, డీఎస్సీ వ్యవహారంపై హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోయిందని, వేలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. కట్ ఆఫ్ మార్కులు ప్రకటించకుండా నియామక ప్రక్రియ కొనసాగించారని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన అభ్యర్థులకు కూడా పోస్టులు ఇవ్వలేదన్నారు. క్రీడా కోటాలోని వందలాది పోస్టులను అక్రమంగా విక్రయించారని విమర్శించారు.
జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కమల్ సాయి మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పూర్తిగా బోగస్‌గా మారిందని అన్నారు. మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేసి, డబ్బు ఉన్నవారికి అవకాశాలు కల్పించారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కమల్ సాయి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు.
