సంగీతం, డప్పుల మోతల మధ్య రథోత్సవం

సంగీతం, డప్పుల మోతల మధ్య రథోత్సవం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని మండల పరిధిలోని సంతే కొల్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా నిర్వహించే సంప్రదాయ రతి–మన్మధుల రథోత్సవ కార్యక్రమాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవం మూడు రోజులపాటు భక్తి, వినోదం, ఆచారాల మేళవింపుగా సాగింది. ఈ ఉత్సవాలలో ముఖ్యంగా పురుషులు శ్రీ వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్త్రీల వేషధారణలో రతి పాత్రను, ఇతరులు మన్మధుడి పాత్రను ధరించి గ్రామంలో ఊరేగింపుగా రావడం స్థానికుల్ని అలరించింది. సంప్రదాయ సంగీతం, డప్పుల మోతల మధ్య రథోత్సవం నిర్వహించడంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాలలో భాగంగా గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న ప్రత్యేక ఆచారాన్ని కూడా నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో కొందరు తమ చేసిన తప్పులను ఒప్పుకుని, పాప విమోచన సంకేతంగా అగ్నిగుండం చుట్టూ శవయాత్ర నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.

అగ్నిగుండం చుట్టూ శవయాత్రగా ఊరేగింపును నిర్వహించడం ద్వారా తమ తప్పులను అంగీకరించి గ్రామ సమాజం ముందు క్షమాపణలు కోరే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అదే సమయంలో కుంభోత్సవ కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా ఉత్సవాలను వీక్షిస్తూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి ఈ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. సాంప్రదాయ ఆచారాలు, గ్రామీణ సంస్కృతి, సామూహిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ రతి–మన్మధుల రథోత్సవం ప్రతి ఏడాది హోలీ సందర్భంగా నిర్వహించబడుతుందని గ్రామస్తులు తెలిపారు.
