Examination | పరీక్షా కేంద్రాల్లో లోపాలు ఉంటే చర్యలు తప్పవు

Examination | పరీక్షా కేంద్రాల్లో లోపాలు ఉంటే చర్యలు తప్పవు
కలెక్టర్ ఇలా త్రిపాఠి
Examination | నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం బోధన్ పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్‌లోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ, విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఉన్న తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను పరిశీలించారు.
అలాగే సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. పలు కేంద్రాల్లో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు తెలియజేయాలని డీఐఈఓ రవికుమార్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ఫస్టియర్ గణితం–1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విజేత జూనియర్ కళాశాలలో మొత్తం 441 మందికి గాను 12 మంది గైర్హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ స్వర్ణలత తెలిపారు. ఉషోదయ కళాశాలలో 358 మందికి గాను 21 మంది హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు.
విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో 406 మందిలో 398 మంది హాజరై, 8 మంది గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ వివరించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించాలని, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బాలికల తనిఖీని మహిళా సిబ్బంది ద్వారా నిర్వహించేందుకు సహకారం అందించాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
