ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు…
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు…
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో ప్రజలతో భేటీ అయిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు స్థానికులు పలు సమస్యలను విన్నవించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దండమూడి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయకుండా పంచాయతీగానే కొనసాగించాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని స్థానిక నాయకులు కోరారు. దీనిపై ఎంపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దండమూడి సమీపంలోని ఓగేరు వాగుపై దండమూడి – ఈవురువారిపాలెం మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద కరకట్టలను బలోపేతం చేయాలని ప్రజలు కోరారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ ఆదేశించారు.గొట్టిపాటి పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాలు, దండమూడి గ్రామంలో దాదాపు 1000 ఎకరాల్లో పండిన శనగలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై మార్క్ఫెడ్ డీఎంతో మాట్లాడి కొనుగోలు పాయింట్లు ఏర్పాటు చేసి కొనుగోళ్లు నిర్వహిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం లేదా పంచాయతీలుగానే కొనసాగించే అంశంపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరారు. మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో చర్చించి పరిష్కార మార్గాలపై దృష్టి సాధిస్తామని ఎంపీ తెలిపారు. గ్రామాల్లో డొంక రోడ్ల అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరగా, అవసరమైన మిషనరీని పంపించి పనులు చేపడతామని ఎంపీ హామీ ఇచ్చారు.
